పాక్‌లో హిందువుల అపహరణ పట్ల ఖండన

పాక్‌లో నివసిస్తున్న ఒక హిందూ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు పెషావర్‌ నగరంలో అపహరించడంపట్ల కేంద్ర ప్రభుత్వం బుధవారం తీవ్రంగా ఖండించింది. ఈ అపహరణకు బాధ్యులయినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది అని విదెశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ పార్లమెంటుకు తెలియ జశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పాక్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, ఆ దేశంలోని గిరిజన ప్రాంతంలో ఇద్దరు సిక్కుల తల నరకడాన్ని, ఈ సంఘటనను పాక్‌ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారనీ బుధవారం లోక్‌ సభలో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టేముందు ఎస్‌ఎం.కృష్ణ చేసిన ప్రకటనలో తెలిపారు. పెషావర్‌ నగరంలోని మార్కెట్‌ ప్రాంతంనుంచి రాబిన్‌ సింగ్‌ అనే కంప్యూటర్‌ ఇంజనీర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోవడం జరిగింది. అతనిని విడిచిపెట్టేందుకు కోటిరూపాయలు ఇవ్వాలని అపహరించినవారు డిమాండు చేశారు.