
తెలంగాణ జెఎసి పిలువు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎందుకు లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యుడు పి. శంకరరావు ప్రశ్నించారు. శానససభ్యులందరితో రాజీనామా చేయించిన కెసిఆర్ తాను ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన అడిగారు. ఇదే విషయాన్ని మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం ప్రజలు అడుగుతున్నారని ఆయన అన్నారు. రాజీనామాల వల్ల సమస్య పరిష్కారం కాదని, ప్రజా ప్రతినిధులుగానే పోరాడి తెలంగాణ సాధించుకోవాలని ఆయన అన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు లాఠీ చార్జీ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ పై సీమాంధ్ర నాయకుల విమర్శలు సరి కాదని, కోదండరామ్ పై కేసులు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉత్పత్తుల బహిష్కరించాలనే తెలంగాణ జెఎసి పిలుపును కూడా ఆయన వ్యతిరేకించారు.