కాంగ్రెస్ ఎంపీలు గుత్తా,మందాల ఘెరావ్
తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మందా జగన్నాధ్, గుత్తా సుఖేందర్‌రెడ్డిలను తెలంగాణ న్యాయవాదులు మంగళళవారంనాడిక్కడ ఘెరావ్ చేసి పదవులకు రాజీనామాలు చేయాలని పట్టుబట్టారు. లోక్‌సభ సమావేశం వాయిదా పడిన తర్వాత పార్లమెంట్‌కు సమీపంలోని విజయ్‌చౌక్ వద్ద తెలుగు టీవీ ఛానళ్లతో మాట్లాడేందుకు వెళ్లిన మందా, గుత్తాలను అక్కడ గుమికూడిన తెలంగాణ న్యాయవాదులు చుట్టుముట్టి పార్లమెంట్ సభ్యత్వాలకు ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. మంగళళవారంనాడు పార్లమెంట్ వద్ద ధర్నా కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీ వచ్చిన తెలంగాణ న్యాయవాదులు రాజీనామాలు చేయాలని కోరేందుకు బుధవారంనాడు పార్లమెంట్ సమీపంలోని విజయ్‌చౌక్ వద్ద కాపుకాశారు. తెలంగాణలో విద్యార్థులు ఆత్మాహుతి చేసుకొంటుండగా మీరిక్కడ పదవుల్లో కొనసాగుతుండడమేమిటని ప్రశ్నించిన న్యాయవాదులు కాంగ్రెస్ ఎంపీలతో వాగ్వివాదానికి దిగారు. తామంతా కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకే చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, రాజీనామాలతో తెలంగాణ ఆవిర్భావం మరింత ఆలస్యమౌతుందే తప్ప ప్రయోజనం ఉండదని వారికి నచ్చజెప్పేందుకు ఎంపీలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.