
వన్డే క్రికెట్ ఆరంభమైన 39 ఏళ్ల అనంతరం మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్‌ను అద్వితీయంగా ఎదుర్కొని మొట్టమొదటి డబుల్ సెంచరీని నమోదుచేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
కెప్టెన్ రూప్‌సింగ్ స్టేడియంలో అమోఘంగా చెలరేగి పరుగుల వరదను పారించి..కెరీర్‌లోనే మరో అద్బుత ఇన్నింగ్స్ నమోదుచేయించడం ద్వారా రెండో వన్డేలో ఇండియాను గెలిపించాడు. 199 పరుగుల వరకు వచ్చిన సచిన్ డబుల్ సెంచరీ అందుకోవడానికి సుమారు రెండు ఓవర్లు వేచి చూడాల్సి వచ్చింది. చివరకు ఆఖరి ఓవర్‌లో 147 బంతిని ఎదుర్కొని ఆ మైలురాయిని పూర్తిచేశాడు. ఈ భారీ ఇన్నింగ్స్‌లో 25 అమోఘ బౌండరీలు 3 సిక్సర్లు ఉన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన సయూద్ అన్వర్ 13 ఏళ్ళ క్రితం ఇండియాపైనే 194 పరుగులు చేసి అత్యధిక రికార్డుతో నిలబడగా, దాన్ని జింబాబ్వేకు చెందిన కోవెంట్రీ గత సంవత్సరం బంగ్లాదేశ్‌పై ఆడుతూ సమం చేయగలిగాడు.
కాగా సచిన్ మాస్టర్ క్లాస్ సూపర్బ్ బ్యాటింగ్‌తో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా కేవలం 3 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో దక్షిణాఫ్రికాను 153 పరుగుల తేడాతో చిత్తుచేసింది. దీంతో మూడువన్డేల సీరీస్‌ను 2-0 తేడాతో హస్తగతం చేసుకుంది. వన్డేల్లో 400 పైగా స్కోరు నమోదుచేయడం ఇండియాకు ఇది మూడోసారి.
ఈ భారీ లక్ష్యాన్ని చేధించడానికి దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ (114) ఒక్కడే సెంచరీతో అలరించగలిగాడు. దాంతోనే వారు 248 పరుగుల వరకు చేయగలిగారు. సీరీస్ నిలుపుకోవాలంటే తప్పకుండా మ్యాచ్‌ను గెలుచుకోవాల్సిన దక్షిణాఫ్రికా టాస్ కొల్పోవడంతోనే సగం మ్యాచ్‌ను పోగొట్టుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ధోనీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుని దానికి తగ్గట్లే భారీ సవాల్‌ను ప్రత్యర్థి ముందు విసిరాడు. ఆపై భారత బౌలర్లు రాణించి దక్షిణాప్రికాను మరో 43 బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్ చేయగలిగారు. 17 పరుగుల స్కోరుకే గిబ్స్ (7) వికెట్‌ను చేజార్చుకున్న తర్వాత ఆ జట్టు మరే దశలోనూ కోలుకోలేదు. శ్రీశాంత్ 3, నెహ్రా, జడేజా, యూసఫ్ పఠాన్ తలో రెండేసి వికెట్లు కూల్చి దెబ్బతీశారు. డివిలియర్స్ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలబడిన బ్యాట్స్‌మన్ ఓపెనర్ అవ్లూ(34)నే. మిగతా వారంతా 20 పరుగుల లోపుననే తిరిగి వచ్చారు. దాంతో డివిలియర్స్ ఒకవైపు ఒంటరిపోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. 101 బంతుల్లో 114 పరుగులు (13ఫోర్లు 2 సిక్సర్లు) చేసిన డివిలియర్స్ అజేయంగా మిగిలాడు.
ఫ్లాట్ పిచ్‌పై కేవలం 9 పరుగులకే డాషింగ్ హిట్టర్ సెహ్వాగ్ థర్డ్‌మాన్‌లో క్యాచ్ ఇచ్చి తిరిగి రాగా, సచిన్ మొదట కార్తీక్, ఆతర్వాత ధోనీతో కలిసి రెండు సెంచరీల భాగస్వామ్యాన్ని నెలకొల్పగలిగాడు. సచిన్- దినేశ్ కార్తీక్ కాంబినేషన్ కలిసి దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరదను పారించింది. దీంతో వీరిద్దరూ రెండో వికెట్‌కు 196 పరుగుల (117 బంతుల్లో) భాగస్వామ్యాన్ని అందించారు. కార్తీక్ 79 (85 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లు) పరుగులు చేసిన అనంతరం 34 ఓవర్‌లో పార్నెల్ బౌలింగ్‌లో గిబ్స్ అందుకున్న క్యాచ్‌తో తిరిగి వచ్చాడు. తర్వాత సచిన్‌తో కలిసిన యూసఫ్ పఠాన్ కేవలం 36 పరుగులకే వికెట్ పోగొట్టుకున్నాడు. సచిన్- పఠాన్ జోడి మూడో వికెట్‌కు 47 బంతుల్లో 81 పరుగులు జత చేయగలిగింది.
ఈ దశలో సచిన్ తో కలిసిన ధోనీ తనైదన స్టైల్‌లో 35 బంతుల్లోనే 68 (7 పోర్లు 4 సిక్సర్లు) పరుగులు చేయడంతోపాటు అజేయమైన నాలుగోవికెట్‌కు 101 పరుగులను జత కలుపడంతో ఇండియా భారీస్కోరును అందుకోగలిగింది. కేవలం 9 ఓవర్లలోనే ఈ జోడి సెంచరీ భాగస్వామ్యాన్ని అందుకోగలిగింది. సచిన్, ధోనీ నిలువరించడం దక్షిణాఫ్రికా బౌలర్లకు ఏ దశలోనూ సాధ్యం కాలేదు. సచిన్ ఆద్యంతం చక్కటి ఇన్నింగ్స్ ప్రదర్శించి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 200 పరుగులతో అజేయంగా మిగిలాడు.
సచిన్ 37 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తిచేయగా సెంచరీని 90 బంతుల్లోనే (13 ఫోర్లు) పూర్తిచేశాడు. సచిన్‌కు వన్డేల్లో ఇది 46వ సెంచరీ. తర్వాత 150 పరుగులను 118వ బంతితో పూర్తిచేసుకో (22 ఫోర్లు 1 సిక్సర్)గలిగాడు.
ఇండియా ఇన్నింగ్స్ ః సెహ్వాగ్ సి స్టేన్ బి పార్నెల్ 9, సచిన్ టెండూల్కర్ నాటౌట్ 200, దినేశ్ కార్తీక్ సి గిబ్స్ బి పార్నెల్ 79, యూసఫ్ పఠాన్ సి డివిలియర్స్ బి వాండెర్ మెర్వ్ 36, మహేంద్రసింగ్ ధోనీ నాటౌట్ 68
ఎక్స్‌ట్రాలు 9
మొత్తం ( 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 401
వికెట్ల పతనం ః 1-25(సెహ్వాగ్) 2-219(కార్తీక్) 3-300(పఠాన్)
బౌలింగ్ ః డేల్‌స్టేన్ 10-0-89-0, పార్నెల్ 10-0-95-2, వాండెర్‌మెర్వ్ 10-0-62-1, లాంగ్‌వెల్ట్ 10-0-70-0, డుమినీ 5-0-38-0, కలిస్ 5-0-44-0
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ః అవ్లూ సి నెహ్రా బి శ్రీశాంత్ 34, గిబ్స్ బి కుమార్ 7,వాండెర్‌మెర్వ్ సి రైనా బి శ్రీశాంత్ 12, కలిస్ బి నెహ్రా 11, డివిలియర్స్ నాటౌట్ 114, పీటర్సెన్ బి జడేజా 9,డుమినీ ఎల్‌బి బి పఠాన్ 0, బౌచర్ ఎల్‌బి బి పఠాన్ 14, పార్నెల్ బి నెహ్రా 18, స్టేన్ బి శ్రీశాంత్ 0, లాంగ్‌వెల్ట్ సి నెహ్రా బి జడేజా 12
ఎక్స్‌ట్రాలు 17
మొత్తం (42.5 ఓవర్లలో ఆలౌట్) 248
వికెట్ల పతనం ః 1-17 (గిబ్స్) 2-47(వాండెర్‌మెర్వ్) 3-61(అవ్లూ) 4-83(కలిస్) 5-102(పీటర్సెన్) 6-103 (డుమినీ) 7-134(బౌచర్) 8-211 (పార్నెల్) 9-216(స్టేన్) 10-248 (లాంగ్‌వెల్ట్)
బౌలింగ్ ః ప్రవీణ్ కుమార్ 5-0-31-1,నెహ్రా 8-0-60-2,శ్రీశాంత్ 7-0-49-3, జడేజా 8.5-0-41-2, యూసఫ్ పఠాన్ 9-1-37-2, సెహ్వాగ్ 5-0-25-0
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ః
సచిన్ టెండూల్కర్